ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉద్యోగ సంఘాల నేతలకు ఆహ్వానం వచ్చింది. ఏపీ ఎన్ జీ వో సంఘం ఆధ్వర్యంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నేతలు-అమరావతి జేఏసీ నేతలు అంతా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి బయలు దేరారు. దసరా లోపు పీఆర్సీ ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. బుధవారం చర్చించి ఏదో ఒక విషయం చెబుతామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారని ఇప్పటికే బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాకు చెప్పారు. ముఖ్యమంత్రితో తమకు భేటీ ఏర్పాటు చేయాలని కూడా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ప్రభుత్వంలో కీలకమైన సజ్జల రామకృష్ణారెడ్డికి విన్నవించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వీరికి పిలుపు రావడం ఏదైనా కీలక పరిణామానికి దారి తీస్తుందా లేక కేవలం ముఖ్యమంత్రిని, వారి కార్యాలయ అధికారులను కలుస్తామని వీరు అభ్యర్థించిన మేరకు మాత్రమే వారు అపాయింట్ మెంటు ఇచ్చారా అన్నది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. JAC ఈ విషయంలో మరింత లోతైన ప్రయత్నం చేస్తోంది. త్వరలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి పీఆర్సీ నివేదిక బయట పెట్టే యోచన కూడా ఉందని - ముందు నివేదిక బయట పెడితే కొంతైనా ఉద్యోగులను సంతృప్తి పరిచే అవకాశం ఉందన్న కోణంలోనూ ప్రభుత్వ వర్గాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత పీఆర్సీ అంశాలు కొలిక్కి వస్తే ఆనక అందులోని అంశాలపై చర్చ...భిన్నాభిప్రాయాలు... ఆ అంశాలు కొలిక్కి రావడానికి మరికొంత సమయం పడుతుంది. ప్రభుత్వానికి ఎలాగూ మరికొంత సమయం అమలకు దక్కుతుంది. తొలుత నివేదిక బయట పెట్టాలనే డిమాండూ ఉంది. ఇప్పటికే పీఆర్సీ నివేదిక సమర్పించి ఏడాది పూర్తయింది. నివేదిక బయట పెట్టే ఆలోచన ఉన్నా ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందన్నది అనేక పరిణామాలపై ఆధారపడి ఉంది.
COMMENTS